DNB News - ఆంధ్రప్రదేశ్ / : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు బాకే హబీబుల్లా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ముస్లిం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూటమి నాయకులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. “ప్రజాగళం” ఉమ్మడి మేనిఫెస్టోలో పండుగ కానుకలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, గత రంజాన్ పండుగకు ముస్లింలకు ఒక్క రూపాయి తోఫా కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఈ నెలలో ప్రారంభమవుతున్న రంజాన్ పండుగకు అయినా తోఫా ఇచ్చి ప్రభుత్వం తన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీ అమలుకాకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే ముస్లింలకు ఎలాంటి షరతులు లేకుండా ఇస్తామని ప్రకటించిన ‘పెళ్లి కానుక’ పథకం ఇప్పటికీ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. ముస్లిం మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలు కూడా పూర్తిగా విస్మరించబడినాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నూర్ బాషా కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన ‘ఇస్లామిక్ బ్యాంక్’ హామీకి ఇప్పటివరకు ఎలాంటి ఆచరణ లేదని నిలదీశారు. కేవలం ముస్లింలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, విద్యార్థులు కూడా ఈ ప్రభుత్వ పాలనలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తున్నా ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు కాకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, మైనార్టీలతో సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని బాకే హబీబుల్లా డిమాండ్ చేశారు.
Admin
DNB News