DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగర పరిధిలో జనగణనలో భాగంగా తొలి విడత ఇంటిగణన చేపట్టడానికి ప్రజల వద్దకు వస్తున్న ఎన్యూమరేట్లకు పూర్తి సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. ఆదివారం ఆయన కింగ్ మార్కెట్, ఖండేరి వీధి ప్రాంతాల్లో జరుగుతున్న ఇంటిగణన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని తెలిపారు. రాబోయే పదేళ్ల కాలానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో జనగణన సమాచారం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. నగర పరిధిలో 911 మంది ఎన్యూమరేట్లు ఇంటిగణన నిర్వహిస్తుండగా, 151 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు నగరంలో 35.07 శాతం జనగణన పూర్తై రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నామని, మే 31లోపు పూర్తి ప్రక్రియను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇళ్ల వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు అవసరమైన వివరాలు అందించాలని సూచించిన కమిషనర్, స్వీయ గణనలో పాల్గొన్న వారు తమ ఎస్‌ఈఐడి నంబర్‌ను ఇవ్వాలని కోరారు. ఆధార్ నంబర్, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు వంటి సమాచారాన్ని ఎన్యూమరేటర్లు ఎట్టి పరిస్థితుల్లో అడగరని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లు తప్పనిసరిగా ఐడి కార్డులు ధరించి ఉంటారని, అనుమానం ఉంటే ప్రజలు వారి గుర్తింపు కార్డులు పరిశీలించాలని సూచించారు. ప్రజలందరూ బాధ్యతతో సహకరించి నగరాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News