DNB News - ఆంధ్రప్రదేశ్ / : మాజీ ముఖ్యమంత్రి వై .ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్రంలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఆదోని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వై. సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఘనంగా ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడం వల్ల మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర నిరాశకు గురయ్యాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేయడం, సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేయడం, అభివృద్ధి పనులను పక్కన పెట్టడం కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో నిర్లక్ష్యం, రైతులకు తగిన మద్దతు లేకపోవడం, మహిళలకు ప్రకటించిన పథకాల అమలులో జాప్యం వంటి అంశాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదన్నారు. ప్రజల ఆకాంక్షలను విస్మరించి పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు “ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలి”, “సూపర్ సిక్స్ హామీలను వెంటనే నెరవేర్చాలి”, “ప్రజా వ్యతిరేక విధానాలను నిలిపివేయాలి” అంటూ నినాదాలు చేశారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
Admin
DNB News