DNB News - ఆంధ్రప్రదేశ్ / : హమాలీ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్‌లో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లారీ హమాలి యూనియన్ మహాసభ యూనియన్ అధ్యక్షుడు ఎం. వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ మహాసభకు సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.ఎస్. రాధాకృష్ణ, మార్కెట్ యార్డ్ యూనియన్ల గౌరవాధ్యక్షుడు టి. రాముడు, సీఐటీయూ నగర అధ్యక్షుడు వై. నాగేష్, కార్యదర్శి ఆర్. నరసింహులు తదితరులు హాజరయ్యారు. మహాసభ ప్రారంభంలో గత రెండేళ్లలో మరణించిన యూనియన్ నాయకులు, కార్మికులకు నివాళులర్పించారు. అనంతరం గత రెండేళ్ల కార్యకలాపాలు, ఆదాయ-వ్యయాల నివేదికలను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీ కార్మికుల సంక్షేమం, భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కార్మికులకు ఉన్న హక్కులను బలహీనపరిచే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేస్తున్నారని ఆరోపించారు. హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని అన్నారు. హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కోసం రాబోయే రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని, అందుకు కార్మికులు ఐక్యంగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మార్కెట్ యార్డ్‌లో కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. అనంతరం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లారీ హమాలి యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా టి. రాముడు, అధ్యక్షుడిగా బి. నాగన్న, కార్యదర్శిగా కే. మధు, ఖజానాదారుగా కే. రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా పరమేష్, సహాయ కార్యదర్శిగా సి. రామకృష్ణ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా ఎం. వెంకటేశ్వర్లు, కేశవులు, శ్రీను, బిసన్న, కే. మద్దిలేటి, కే. అంజి, పి. విజయ్‌లను ఎంపిక చేశారు. ఈ మహాసభకు కోత హమాలి యూనియన్ సహాయ కార్యదర్శి వెంకటస్వామి తదితరులు హాజరయ్యారు.
Admin
DNB News